Varalakshmi Vratham Pooja Vidhanam Telugu PDF

Varalakshmi Vratham Pooja Vidhanam in Telugu PDF download free from the direct link below.

Varalakshmi Vratham Pooja Vidhanam - Summary

Varalakshmi Vratham is a special festival celebrated by many Hindu women, especially in South India. It is observed on a Friday during the month of Shravan (usually in July or August). On this day, women worship Goddess Lakshmi, the goddess of wealth, happiness, and good fortune. They pray for the well-being of their family, especially for their husbands and children.

The pooja (ritual) is performed with great devotion and love. Women decorate their homes, wear traditional clothes, and place a decorated Kalasha (a pot filled with rice, water, and coins) which represents Goddess Lakshmi. They chant prayers, offer flowers, fruits, and sweets, and follow a specific pooja process known as the Varalakshmi Vratham Vidhanam. This ritual is believed to bring prosperity, peace, and blessings to the household.

Also Check – Lakshmi Ashtottara Shatanamavali Telugu PDF

వరలక్ష్మీ వ్రత కథ (Varalakshmi Vratham Book in Telugu)

సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. ‘ఓ మునీశ్వరు లారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి’. ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి’ అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. ‘ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను’. పార్వతీదేవి ‘ నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి’ అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను.

పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.

ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ‘ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను’ అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి ;
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయేశరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసింది.

‘ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది’. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.

ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ‘ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి’ అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.

వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.

చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితేనారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా

అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేసారు.

తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి.వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.

చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.

వారు త్రోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.

అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ‘ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును’ అన్నాడు పరమశివుడు.

సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో ‘మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది’ అన్నారు.

Download the Sri Varalakshmi Vratham Pooja Vidhanam and Katha in PDF format using the link given below.

RELATED PDF FILES

Varalakshmi Vratham Pooja Vidhanam Telugu PDF Download