Vemana Padyalu Telugu with Bhavam

❴SHARE THIS PDF❵ FacebookX (Twitter)Whatsapp
REPORT THIS PDF ⚐

Vemana Padyalu Telugu with Bhavam

తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని , తీయదనాన్ని ప్రపంచానికి తెలియచేయడం లో పద్యాలు గొప్ప పాత్ర వహించాయి . వాటిలో కొన్ని మన కోసం, మన రాబోయే తరాలకోసం .. గర్వంగా నేర్పిద్దాం ,తెలుగు జాతి గౌరవం నిలబెట్టడం లో మనవంతు కృషి చేద్దాం .

పద్యం అమ్మలా లాలిస్తుంది ,నాన్నలా దైర్యం చెపుతుంది ,గురువులా సన్మార్గం చూపుతుంది, స్నేహితునిలా సంతోషాన్ని పంచుతుంది. పద్యాన్ని పాఠంలా చెప్పమని నా ఉద్దేశ్యం కాదు , పద్యాన్ని పరిచయం చేయండి చాలు. అదే అవసరం లో ఆసరాగా ఉంటుంది .

Vemana Padyalu in Telugu with Bhavam

1.చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు ;
కొంచమైనా నదియు కొదువ కాదు ;
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత !
విశ్వదాభిరామ! వినురవేమ !

భావం :మనసుపెట్టి చేసే ఏ చిన్న పని అయినా సత్ఫలితాన్నిస్తుంది ,మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు . మర్రి చెట్టు విత్తనం ఎంత చిన్నదయినా ఏంతో పెద్ద చెట్టయి విస్తరిస్తుంది . కాబట్టి ఏ పనైనా మనసుపెట్టి చేయాలి .

2.ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు ;
చూడ చూడ రుచులజాడవేరు ;
పురుషులందు పుణ్య పురుషులు వేరయా!
విశ్వదాభిరామ! వినురవేమ !

భావం :ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేవిధంగా అంటే తెల్లగా ఉంటాయి , కానీ వాటి రుచిలో వ్యత్యాసం ఉంటుంది . అదే విధంగా మనుషులు అందరూ చూడడానికి ఒకేవిధంగా వుంటారు కానీ ,వారి స్వభవాలు ఒకేవిధంగా వుండవు . మంచివారు వుంటారు ,చెడ్డవారువుంటారు .

3.అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచె ముండుటెల్ల కొదవుగాదు
కొండ యద్దమందు కొంచమైయుండదా
విశ్వదాభిరామ! వినురవేమ !

భావం :అవకాశం లేని చోట గొప్పవారం అని చెపుకోకూడదు . కొండ అద్దం లో చిన్నగా కనిపించినంత మాత్రాన ,నిజంగా కొండ చిన్నదై పోతుందా..

4.ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగెనేని మరియంట నేర్చునా ?
విశ్వదాభిరామ! వినురవేమ !

భావం :ఇనుము రెండు మూడు సార్లు విరిగినా దానిని కమ్మరి సులువుగా అతికిస్తాడు ,కానీ మనిషి మనసు ఒక్కసారి విరిగితే మళ్ళీ దానిని అతికించడం దేవుని వల్లకూడా కాదు .

5.మేడి పండు జూడ మేలిమై యుండు
పొట్టవిప్పి జూడ పురుగులుండు
పిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినురవేమ !

భావం :మేడి పండు చూడడానికి చక్కగా ఎర్రగా ఉంటుంది కానీ దాని పొట్టలో అన్ని పురుగులే ఉంటాయి ,అదే విధంగా పిరికివాడు చూడడానికి గంభీరంగా వున్నా వాడి మదినిండా పిరికితనం ఉంటుంది.

6.అల్పుడెపుడు బల్కు ఆడంభరంగానూ
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ! వినురవేమ !

భావం : తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు ,మంచి బుద్ధి గలవాడు తక్కువగా మాట్లాడుతాడు . కంచు మోగినట్లు ,బంగారం మోగదు గదా .

7.చంపదగిన యట్టి శత్రువు తనచేత
చిక్కినేని కీడు చేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు
విశ్వదాభిరామ! వినురవేమ !

భావం : చంపదగిన శత్రువు మనకు దొరికినా వాడిని చంపకూడదు ,వాడికి మంచి చేసి విడిచిపెడితే చాలు . అదే వాడికి చావుతో సమానం .

మరికొన్ని..

8.తల్లిదండ్రుల యడల దయలేని పుత్రుడు
పుట్టనేమి ? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టవా !గిట్టవా!
విశ్వదాభిరామ! వినురవేమ !

భావం: తల్లిదండ్రుల మీద దయలేని కుమారుడు పుట్టినా వాడు చచ్చిన వాడితో సమానం . పుట్టలో జన్మించే చెదపురుగులు ఏవిదంగా నిరుపయోగంగా చనిపోతాయో వాడు కూడా అంతే .
9.గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినురవేమ !

భావం: మంచి ఆవు పాలు ఒక్క గరిటెడు తాగినా చాలు ,గాడిద పాలు కుండనిండుగా తాగినా ఉపయోగం ఉండదు . అదేవిధంగా భక్తితో పెట్టిన కొంచం ఆహారం ఐనా సంతృప్తి నిస్తుంది .
10.విద్యలేని వాడు విద్యాధికులు చెంత
నుండినంత పండితుడు కాదు
కొలని హంసలకడం గొక్కెరయున్నట్టు
విశ్వదాభిరామ! వినురవేమ !

భావం :కొలనులో హంసల మధ్య కొంగ దాని జాతిబేధం కనబడినట్లు , విద్యాధికులు మధ్య అవివేకి వున్నను వానికి కొంచం కూడా వివేకం రాదు.

11.అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన !
విశ్వదాభి రామ !వినురవేమ!

భావం : పాడగా పాడగా పాట రాగయుక్తంగా మారుతుంది ,అలాగే తినగా తినగా వేప ఆకు కూడా మధురంగా ఉంటుంది . అలాగే భూమిపై ఎటువంటి పని అయినా సాధన చేయగా చేయగా సఫలం అవుతుంది .

12.తప్పులెన్ను వారు తండోపతండంబు
ఉర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభి రామ !వినురవేమ!

భావం :ఇతరుల తప్పులను ఎత్తి చూపేవాళ్లు కోకొల్లలు , ఈ భూమిపై జనులందరు ఎదోఒకతప్పు చేసేవుంటారు . ఇతరులలో తప్పులు ఎంచేవారు తమ తప్పు లు తాము తెలుసుకోలేరు .

ఇంకొన్ని..

13.చీడపురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వదాభి రామ !వినురవేమ!

భావం :మహా వృక్షం కూడా వేరుకు పురుగు పడితే చచ్చిపోతుంది ,చెట్టుకు చీడ పడితే ఆ చెట్టు కూడా చచ్చిపోతుంది . అలాగే చెడ్డవారితో సాంగత్యం చేయడం వలన ఎంత మంచివాడైనా చెడిపోతాడు .

14.చెప్పులోనిరాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ! వినుర వేమా!

భావం:చెప్పులోని రాయి, కంటిలోని నలుసు, కాలిలో దిగిన ముల్లు, ఇంటిలోని గొడవ చాలా భాదపెడతాయని అర్థము.

15.ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన
నలుపు నలుపే కాని తెలుపు కాదు
కొయ్యబొమ్మతెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభి రామ! వినురవేమ !

భావం:ఎలుక తోలు తెచ్చి ఎంతకాలము ఉతికినా దాని నలుపు పోయి తెలుపు రాదు. అలాగే ప్రాణం లేని చెక్కతో చేసిన బొమ్మను ఎంత కొట్టినా పలుకదు కదా?

16.నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బైట మూరెడైనఁబాఱలేదు
నెలవు తప్పుచోట నేర్పరి కొరగాఁడు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: పడవ నీటియందు చక్కగా నడుచును భూమి మీద మూరెడైననూ పోజాలదు. అట్టే స్థానబలము లేకున్నచో బుద్ధిమంతుడైననూ మంచిని గ్రహింపలేరు.

17.పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక! పరహితచారై
పరు లలిగిన తా నలగక
పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!

భావం: తోటి స్త్రీలను తన సొదరిలుగా భావించి, పరుల ధనమును సేకరించుట మానివేసి, ఇతరుల కోపించినను తాను కోపించుకొనక, ఇతరులచే కీర్తింపబడుతూ జీవన విధానమును చేయవలెను అని భావం.

18.కానివాని తోడ గలసి మెలఁగుచున్నఁ
గాని వానిగానె కాంతు రవనిఁ
దాటి క్రిందఁబాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: గౌరవం లేని వారితో కలిసి తిరుగుచున్నచో ఆ వ్యక్తిని అందరూ గౌరవము లేని వానిగానే భావిస్తారు. ఎలా అనగా ఓ వ్యక్తి తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు తాగుచున్ననూ, అతను త్రాగు చున్నది పాలు అని కాకుండా కల్లు త్రాగుచున్నారని అందరూ భావించగలరు గదా! అని అర్థం.

19.పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న నెంచ గుణపు ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: దేవుని పూజల కంటే నిశ్చలమైన బుద్ధి ఉండుట మంచిది. మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనస్సు కల్గియుండుట మంచిది, అదేవిధంగా వంశము యొక్క గొప్పతనం కంటే ఆ వ్యక్తి యొక్క మంచితనం చాలా ముఖ్యము.

20.నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుఁడాఁడు రీతి నధికుండు నాఁడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం : ఓ వేమనా! గొప్ప నదులు నిదానంగానూ, గంభీరంగానూ ప్రవహించును. కానీ చిన్న వాగు మాత్రం , చాలా వేగంగా గట్లు అన్ని దాటి పొంగి పొర్లి ప్రవహించును. అట్లే యోగ్యుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడును. నీచుడు వాగుచూ ఉండును.

ఇంకొన్ని..

21.మర్మమెఱుగ లేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖ మొందుచుంద్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: అద్దాల గదిలో ఉన్న కుక్క దర్పణంలో తన ప్రతిబింబాన్ని చూచి కలతపడి ఏ విధంగా బాధపడుతుందో, అలాగే మూఢ జనులు ఆత్మతత్వం తెలుసుకోలేక, విభిన్న మతాలను కల్పించి, మతమౌడ్యంలో చిక్కుకుని, ఒకరినొకరు ద్వేషించుకొనుచూ, దుఃఖంతో కాలం గడుపుతున్నారు.అసలు నిజానికి దేవుడు ఒక్కటే అని గుర్తించ లేని అజ్ఞానంలో ఉన్నారు.

22.నేరనన్నవాఁడె నేర్పరి మహిలోన
నేర్తునన్నవాఁడు నిందఁజెందు
ఊరకున్నవాఁడె యుత్తమ యోగిరా!
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: తెలివిగలవాడు తనకేమియు తెలియదు, అని నిదానముగా మాట్లాడును. తెలియునన్నచో వాదించెదరు. అపకీర్తి రావచ్చును గాన తెలివిగలవాడు ఋషివలె మౌనంగా నుండును. కానీ తెలివి లేనివాడు అన్ని తెలిసినట్లు నటిస్తూ చివరకు అపనిందలు పాలవుతాడు. .

23ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికివచ్చు.
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: విశ్వవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి.కానీ నీచుడు సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, అంతేకాకుండా సంఘానికి హాని కూడా చేస్తాడు.

24.నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బైట కుక్క చేత భంగ పడును
స్థానబల్మిగాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఓ వేమనా! నీటి లో ఉన్న మొసలి ఎంత చిన్నదైననూ అతి పెద్ద ఏనుగును కూడా నీటిలోనికి లాగి చంపివేయ గలదు . కానీ ఆ మొసలి తన స్థానమైన నీటి లో నుండి బయటకు వచ్చినపుడు శునకం (కుక్క) చేత కూడా ఓడింపబడును. నిజానికి మొసలికి ఆ బలము స్థానము వలన వచ్చిందే కాని అది తన సొంత బలము కాదు.

25.వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు.
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: వంకర కర్రను మంటలో వేడి చేసి తిన్నగా చేయవచ్చు, కొండలను పిండి చేయవచ్చు. కఠిన చిత్తుని దయావంతునిగా మార్చలేం.

26.పని తొడవులు వేరు బంగారమొక్కటి
పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి
అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలు ఎన్నో రకాలు, కానీ దానికి వాడే మూల వస్తువు బంగారం ఒక్కటే. అదేవిధంగా మన శరీరాలు వేరు వేరు కాని దానిలో కదలాడే ప్రాణం మాత్రం ఒక్కటే,మనం తినే ఆహారాలుఅనేకం ఐనా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని అర్థం.

27.నీచగుణములెల్ల నిర్మూలమైపోవు
కొదవలేదు సుజన గోష్ఠి వలన
గంధ మలద మేనికంపడగినయట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికుండే దుర్గంధం ఎలా పోతుందో అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి. అందుచేత సదా మంచివారి స్నేహాన్నే కోరుకోవాలి అని అర్థం.

ఇంకొన్ని..

28.ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె
పసిడి గలుగు వాని పిపిన జేసె
బ్రహ్మదేవు సేత పదడైన సేతరా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం:ఆ బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టు వానిగా మార్చాడు.ఆ బ్రహ్మదేవుడు చేసిన పని విలువలేని బూడిదతో సమానం అని అర్థం.

29.కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు
యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొకటే
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. అసలు పదార్ధం ఒక్కటే కాని ఇక్కడ మనం వేరు వేరు భాషలలో పిలుస్తాం . అలాగే మీరు దేవుడిని ఏ పేరుతో పిలిచినా . కేవలం పేర్లు మార్పే కాని పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే. మతాలు వేరైనా మనుష్యులు ఒక్కటే అని అర్థం.

30.ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు
నొరుల వశముగాదు ఓగుదెల్ప
యేటివంక దీర్ప నెవ్వరి తరమయా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని వాదించటం మూర్ఖుని యొక్క సహజ లక్షణం. అలాంటి వాడికి తెలియజెప్పటం ఎవరి తరం కాదు. ఏరు కుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిగ్గా చేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము.

31.అసువినాశమైన నానంద సుఖకేళి
సత్యనిష్ఠపరుని సంతరించు
సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: సత్యనిష్టాగాపరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడుగానీ, అసత్యమాడటానికి మాత్రం అంగీకరించాడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు. పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం.

32.పగలుడుగ నాసలుడుగును
పగవుడుగం గోర్కెలుడుగు వడిజన్మంబుల్
తగులుడుగు భోగముడిగిన
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: విరోధాలు లేనప్పుడు ఆశలు ఉండవు. విచారం లేకపోతే కోరికలుండవు. సుఖం నశించినపుడు అనురాగం ఉండదు. త్రిగుణాలు నశిస్తేనే ముక్తి కలుగుతుంది.

ఇంకొన్ని..

33.లోభమోహములను ప్రాభవములు తప్పు
తలచిన పనులెల్ల తప్పి చనును
తానొకటి దలచిన దైవమొండగుచుండు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: లోభం, మొహం ఉండేవారికి గొప్పతనం ఉండదు. అటువంటివారు తలచిన పనులు జరగవు. తానొకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తాడు అని అర్థం.

34.మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు
కొఱికి చూడ లోనంజుఱు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మిరియము గింజ పైకి చూచినచో నల్లగా యున్ననూ, కొరికి చూచినచో కారంగా మంటగా ఉండును. అదేవిధంగా మంచివాడు బయటకు చూడడానికి అందంగా లేకపోయిననూ, లోపల మస్తిష్కమందు అంతా మేధాసంపత్తి నిండియుండును.

35.కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి
పసుల వన్నె లెన్నొ పాలొకటియె
పుష్పజాతులెన్నొ పూజయొక్కటె సుమీ
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఆభరణములు వేరైనా బంగారం ఒక్కటే. పశువుల రంగుల వేరైనా పాలు ఒక్కటే. సుగంధ భరిత మైన పుష్ప(పూలు) జాతులు వేరైనా చేసే పూజ మాత్రం ఒక్కటే. అలాగే శాస్త్ర పరిజ్ఞానం గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒక్కటే.

ఇంకా మరెన్నో… మన కోసం ,మన భావితరాల మనోవికాసం కోసం .
మళ్ళీ మళ్ళీ చదువుదాం తెలుగు వెలుగును ప్రసరింపజేద్దాం .

మీకు ఎటువంటి అంశం గురించి వ్యాసం కావాలో కామెంట్స్ లో తెలియజేయగలరు .

2nd Page of Vemana Padyalu Telugu with Bhavam PDF
Vemana Padyalu Telugu with Bhavam

Vemana Padyalu Telugu with Bhavam PDF Free Download

REPORT THISIf the purchase / download link of Vemana Padyalu Telugu with Bhavam PDF is not working or you feel any other problem with it, please REPORT IT by selecting the appropriate action such as copyright material / promotion content / link is broken etc. If this is a copyright material we will not be providing its PDF or any source for downloading at any cost.